Wednesday, December 12, 2018

కేశవ నామాల విశిష్టత (13-24)

కేశవ నామాల విశిష్టత

కేశవ నామాల విశిష్టత (13-24)

*13. ఓం సంకర్షణాయ నమః*
(శంఖం_పద్మం_చక్రం_గద)
భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి ‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు. ఈ యన గాయత్రిలోని‘స’ అన్న అక్షరానికీ, పాయు తత్త్వానికీ, కృష్ణ పక్షంలో నుదిటిపై ధరించే నామానికీ, ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ, మనోమయ కోశానికీ, క్షత్రియవర్ణానికీ, స్త్రీశరీరానికీ, ఋతు సామాన్యానికీ, రుద్రునికీ, మధ్యాహ్నసవనానికీ, ఆవేశ రూపాలకూ, రాజస ద్రవ్యాలకూ, త్రేతాయుగానికీ, శరదృతువుకూ నియామకుడు.

*14. ఓం వాసుదేవాయ నమః*
(శంఖం_చక్రం_పద్మం_గద)
త్రిలోకాలకూ ఆవాస స్థానమైనవాడూ, సర్వాంతర్యామీ, సర్వశక్తుడూ, సర్వచేష్టకుడూ, సర్వాభీష్టప్రదుడూ, యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ, వసుదేవ సుతుడూ అయినందువల్ల శ్రీ హరి ‘వాసుదేవుడు’ అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘ధీ’ అన్న అక్షరానికీ, ఉపస్థ తత్త్వానికీ, కృష్ణపక్షంలో ఉదర మధ్యంలో ధరించే నామానికీ, పంచదారకూ, బెల్లానికీ, బ్రాహ్మణవర్గానికీ, పురుషశరీరానికీ, సాయంసవనానికీ, అవతార రూపాలకూ, శుభద్రవ్యాలకూ, కృతయుగానికీ, హేమంత ఋతువుకూ నియామకుడు.

*15. ఓం ప్రద్యుమ్నాయ నమః*
(శంఖం_గద_పద్మం_చక్రం)
అసదృశమైన కాంతీ, యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’ అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘మ’ అన్న అక్షరానికీ, శబ్ద తత్త్వానికీ, కృష్ణ పక్షంలో హృదయ భాగంలో ధరించే నామానికీ, వడపప్పు మొదలైన పదార్థాలకూ, వైశ్యవర్ణానికీ, స్త్రీ శరీరానికీ, అయనానికీ, ప్రాతఃసవనానికీ, లీలారూపాలకూ, పీతవర్ణ ద్రవ్యాలకూ, ద్వాపర యుగానికీ, వర్ష ఋతువుకూ నియామకుడు.

*16. ఓం అనిరుద్ధాయ నమః*
(గద_శంఖం_పద్మం_చక్రం)
ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ, సర్వ శక్తుడూ, గుణ పూర్ణుడూ, మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ, జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ, వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’ అనబడుతున్నాడు. ఈ యన గాయత్రిలోని‘ హి’ అన్న అక్షరానికీ, స్పర్శ తత్త్వానికీ, కృష్ణ పక్షంలో కంఠమధ్య భాగంలో ధరించే నామానికీ, చేదుపదార్థాలకూ, శూద్ర వర్ణానికీ, అన్నమయకోశానికీ, భోగ్య వస్తువులన్నింటికీ, అబ్దానికీ,           నల్లని ద్రవ్యాలకూ, కలియుగానికీ,  గ్రీష్మ ఋతువుకూ నియామకుడు.

*17. ఓం పురుషోత్తమాయ నమః*
(పద్మం_శంఖం_గద_చక్రం)
దేహ నాశంగల సర్వ జీవులూ క్షర పురుషులు. ఏ విధమైన నాశనమూ లేని అప్రాకృత శరీరంగల శ్రీమహాలక్ష్మి దేవి అక్షర పురుష. ఈ ఉభయ చేతనుల కంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీ హరి‘ పురుషోత్తముడు’ అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని ‘థి’ అన్న అక్షరానికీ, రూప తత్త్వానికీ, కృష్ణ పక్షంలో ఉదరం కుడిభాగం మీద ధరించే నామానికీ, ఇంగువ, యాలకులు, ఆవాలు, కర్పూరాలకూ నియామకుడు.

*18. ఓం అధోక్షజాయ నమః*
(గద_శంఖం_చక్రం_పద్మం)
ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదులవల్ల ప్రాదుర్భవించినవాడూ, నిత్యజ్ఞాన స్వరూపుడూ, అక్షయ కుమారుడిని సంహరించిన హనుమంతుడి చేత తెలియబడేవాడూ  అయినందువల్ల  శ్రీ హరి    ‘అధోక్షజుడు’ అనబడుతాడు. ఈయన గాయత్రిలోని‘యో’ అన్న అక్షరానికీ, రసతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ, పాలకూ, పానకమూ, మజ్జిగకూ, పచ్చి పులుసుకూ, నేతితో, నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు.

*19. ఓం నారసింహాయ నమః*
(పద్మం_గద_శంఖం_చక్రం)
నరుడిలాగా, సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగి వున్నందువల్ల శ్రీ హరి ‘నారసింహుడు’ అనబడుతాడు.
ఈయన గాయత్రిలోని ‘యో’ అన్న అక్షరానికీ, గంధ తత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ, బూడిద గుమ్మడికాయ, నువ్వులు, మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ, ఈశాన్య దిక్కుకూ నియామకుడు.

*20. ఓం అచ్యుతాయ నమః*
(పద్మం_చక్రం_శంఖం_గద)
శుద్ధ జ్ఞానానందాలే దేహంగా కలవాడూ, సకల గుణ పరిపూర్ణుడూ, సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ, దోషరహితుడూ అయినందువల్లా శ్రీ హరి ‘అచ్యుతుడు’ అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘నః’ అన్న అక్షరానికీ, ఆకాశ తత్త్వానికీ, కృష్ణ పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ, ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు. 

*21. ఓం జనార్థనాయ నమః*
(చక్రం_శంఖం_గద_పద్మం)
సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు, కైటభ, హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ,  మోక్షప్రదుడూ,     జన్మలేనివాడూ,    సంసార దుఃఖాన్ని పరిహరించేవాడూ, సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీ హరి ‘జనార్ధనుడ’ య్యాడు. ఈ జనార్ధనుడు గాయత్రి లోని ‘ప్ర’ అన్న అక్షరానికీ, వాయుతత్త్వానికీ, కృష్ణ పక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ, ఉప్పుకూ, నైరుతి దిక్కుకూ నియామకుడు.

*22. ఓం ఉపేంద్రాయ నమః*
(గద_చక్రం_పద్మం_శంఖం)
ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి  ‘ఉపేంద్రుడు’   అనబడుతున్నాడు. ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని ‘చో’; అన్న అక్షరానికీ, తేజో తత్త్వానికీ, కృష్ణ పక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ, అరటిపండు, కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ, వాటి రసాలకీ, తూర్పు దిక్కుకూ నియామకుడు.

*23. ఓం హరయే నమః*
(చక్రం_పద్మం_గద_శంఖం)
భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడం చేత నారాయణుడు ‘హరి’ అనబడుతున్నాడు. ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ, అపో తత్త్వానికీ, కృష్ణపక్షంలో ఎడమ భుజం మీద ధరించే నామానికీ, తాంబూలానికీ నియామకుడు.

*24. ఓంకృష్ణాయనమః*
(గద_పద్మం_చక్రం_శంఖం)
సృష్టి, స్థితి, సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ, పూర్ణానందస్వరూపుడూ,  నీలవర్ణ దేహ కాంతి కలవాడూ అయినందువల్ల శ్రీహరి “కృష్ణుడు” అనబడుతున్నాడు.
ఈ కృష్ణుడు గాయత్రిలోని ‘యాత్’ అన్న అక్షరానికీ, పృథ్వీ తత్త్వానికీ, కృష్ణ పక్షంలో మెడ మీద ధరించే నామానికీ, త్రాగే నీటికీ, దైహిక కర్మకూ    నియామకుడు.
*🦑ఓం.. నమో... శ్రీ వేంకటేశాయా !!!* 🦑

Monday, December 10, 2018

కేశవ నామాల విశిష్టత (01-12)

కేశవ నామాల విశిష్టత

కేశవ నామాల విశిష్టత*  (01-12)

మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ
 కేశవాయనమః
 నారాయణాయనమః,
 మాధవాయనమః
అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని, తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము. ఈ 24 కేశవ నామాలు  చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది. ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే  ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది. ప్రీతితో కార్యము చేస్తాము.

1. ఓం కేశవాయనమః*
(శంఖం _చక్రం_గద_పద్మం)
బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ, నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’ అనబడుతున్నాడు. ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న మొదటి అక్షరానికీ, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ, ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికీ, మార్గశీర్ష మాసానికీ,శుక్ల పక్షంలో లలాటం మీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ, మేషరాశికీ, ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు.

*2. ఓం నారాయణాయనమః* 
(పద్మం_గద_చక్రం_శంఖం)
నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’. ఆయన చేత, సృష్టించబడిన జలం ‘నార’ అనబడుతోంది. ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు. ఈయన వాసుదేవ మహ రామంత్రంలోని ‘న’ అక్షరానికీ, గాయత్రిలోని ‘స’ అన్న అక్షరానికీ, మహత్తత్వానికీ, పౌష్యమాసానికీ, శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ, వృషభ రాశికీ, పరమాన్నానికీ, ప్రాతఃకాలానికీ  నియామకుడు.

*3. ఓం మాధవాయ నమః*
(చక్రం_శంఖం_పద్మం_గద)
‘మధు’నామక యదువంశ శాఖలో జన్మించడం వల్లా, రమాదేవికీ పతి అయినందువల్లా, సర్వోత్తముడు అయినందువల్లా, శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు. ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని ‘మో’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని ‘వి’ అన్న అక్షరానికీ, అహంకారతత్వానికీ, మాఘమాసానికీ, శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ, మిథునరాశికీ, భక్ష్యాలకూ నియామకుడు.

*4. ఓం గోవిందాయ నమః*
(గద_పద్మం_శంఖం_చక్రం)
వేదాల మూలంగా పొందబడేవాడూ, భూమినీ, గోవులనూ రక్షించేవాడూ, మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు. ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని 'భ’ అన్న అక్షరానికీ’ గాయత్రిలోని “తుః” అన్న అక్షరానికీ, మనస్తత్త్వానికీ, పాల్గుణ మాసానికీ, శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ, కర్కాటక రాశికీ, నేయికీ నియామకుడు.

*5. ఓం విష్ణవే నమః*
(పద్మం_శంఖం_చక్రం_గద)
జ్ఞానానందాది సమస్త గుణాలతో, దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు. ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని ‘గ’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని ‘వ’ అన్న అక్షరానికీ కర్ణతత్త్వానికీ, చైత్రమాసానికీ, శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ, సింహరాశికీ, పాలకూ నియామకుడు.

*6. ఓం మధుసూదనాయ నమః
    (శంఖం_పద్మం_గద_చక్రం)
“మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా, సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి ‘మధుసూదనుడు’  అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలో ని‘వ’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని ‘రే’ అన్న అక్షరానికీ, త్వక్ తత్త్వానికీ, వైశాఖమాసానికీ, శుక్లపక్షంలో కుడిస్తనం మీద ధరించే నామానికీ, కన్యారాశికీ, మధుర భక్ష్య విశేషానికీ నియామకుడు. ఈ మధుసూదనుడు ‘హస్తిని’ నాడిలో ఉంటాడు

*7. ఓం త్రివిక్రమాయ నమః*
 (గద_చక్రం_శంఖం_పద్మం)
మూడు వేదాలనూ, మూడు కాలాలనూ, సత్త్వాది మూడు గుణాలనూ, భూరాది మూడు లోకాలనూ, త్రివిధ జీవులనూ, చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు. వాసుదేవ మహామంత్రంలోని “తే” అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘ణి’ అన్న అక్షరానికీ, నేత్ర తత్త్వానికీ, జ్యేష్ఠమాసానికీ, శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ, తులా రాశికీ, వెన్నకూ నియామకుడు.

*8. ఓం వామనాయ నమః*
(చక్రం_గద_పద్మం_శంఖం)
అపేక్షిత సుఖాలనూ, అభీష్టాలనూ కరుణించేవాడూ, మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘వామనుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘వా’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘ యం’ అన్న అక్షరానికీ  జిహ్వా తత్త్వానికీ, ఆషాడమాసానికీ, శుక్ల పక్షంలో కంఠం కుడి వైపున ధరించే నామానికీ, వృశ్చికరాశికీ, పెరుగుకూ నియామకుడు.

*9. ఓం శ్రీధరాయ నమః*
(చక్రం_గద_శంఖం_పద్మం)
శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా, పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి ‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘సు’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘భ’ అన్న అక్షరానికీ, ఘ్రాణ తత్త్వానికీ, శ్రావణమాసానికీ, శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో  ధరించే నామానికీ, ధనూరాశికీ, ముద్దపప్పుకూ నియామకుడు.

*10. ఓం హృషీకేశాయ నమః*
(చక్రం_పద్మం_శంఖం_గద)
ఇంద్రియ నియామకుడూ, రమ, బ్రహ్మ, రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’  అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’ అన్న అక్షరానికీ,గాయత్రిలోని ‘ర్గో’ అన్న అక్షరానికీ, వాక్‍తత్త్వానికీ, భాద్రపద మాసానికీ, శుక్లపక్షంలో ఎడమ భుజం మీద ధరించే నామానికీ, మకర రాశికీ, ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు.

*11. ఓం పద్మనాభాయ నమః*
(పద్మం_చక్రం_గద_శంఖం)
నాభిలో పద్మాన్ని కలిగినవాడూ, భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ, సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీ హరి ‘పద్మనాభుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘దే’ అన్న అక్షరానికీ, పాణితత్త్వానికీ, ఆశ్వయుజ మాసానికీ, శుక్ల పక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ, కుంభరాశికీ, కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు.

*12. ఓం దామోదరాయ నమః*
(శంఖం_గద_చక్రం_పద్మం) 
యశోద చేత పొట్టకు బిగించబడిన తాడు గలవాడూ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ, దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ, దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ, దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందువల శ్రీహరి ‘దామోదరుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘య’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘వ’ అన్న అక్షరానికీ, పాదతత్త్వానికీ, కార్తీక మాసానికీ, శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ, మీన రాశికీ, అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు.

Friday, December 7, 2018

కార్తీక పురాణం - 30వ అధ్యాయం

కార్తీక పురాణం - 30వ అధ్యాయం

చివరి రోజు
కార్తీక పురాణం - 30వ అధ్యాయం  చివరి రోజు
ఫలశ్రుతి
నైమిశారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరికీ సూతమహర్షి కార్తీక వ్రత మహిమా ఫల శ్రుతిని తెలియజేశారు. విష్ణు మహిమ, విష్ణు భక్తుల చరిత్రలను విని అంతా ఆనందించారు. వేయినోళ్ల సూతమహర్షిని కొనియాడారు. శౌనకాది మహామునులకు ఇంకా సంశయాలు తీరకపోవడంతో సూత మహర్షిని చూసి ”ఓ మహాముని! కలియుగంలో ప్రజలు అరిషడ్వర్గాలకు దాసులై, అత్యాచారపరులై జీవిస్తున్నారు. సంసార సాగరంలో తరించలేకపోతున్నారు. అలాంటి వారికి సులభంగా ఆచరించే వ్రతాలేమైనా ఉన్నాయా? ఉంటే మాకు వివరించండి. ధర్మాలన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేదో సెలవివ్వండి. దేవతలందరిలో ముక్తిని కలిగించే దైవం ఎవరో చెప్పండి. మానవుడిని ఆవరించిన అజ్ఞానాన్ని రూపుమాపి, పుణ్యఫలమిచ్చే కార్యమేమిటో తెలపండి. ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమిటి? హరినామస్మరణ సర్వదా చేస్తున్నా… మేము ఈ సంశయాల్లో కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి మాకు వివరించి, మమ్మల్ని ఉద్దరించండి” అని కోరారు. దానికి సూత మహర్షి ఇలా చెబుతున్నారు… ”ఓ మునులారా! మీకు కలిగిన సంశయాలు తప్పక తీర్చుకోవాల్సినవే. కలియుగంలో మానవులు మందబుద్ధులు. క్షణికములైన సుఖాలతో నిండిన సంసార సాగరం దాటేందుకు మీరు అడిగిన ప్రశ్నలు దోహదపడతాయి. మోక్షసాధనలుగా ఉంటాయి. కార్తీక వ్రతం వల్ల యాగాది క్రతువులు చేసిన పుణ్యం, దాన ధర్మ ఫలాలు చేకూరుతాయి. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనదని ఆ శ్రీహరే సెలవిచ్చారు. ఆ వ్రత మహిమ వర్ణించడానికి నాకు శక్తి సరిపోదు. అంతేకాదు. సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడికి కూడా శక్యం కాదు. అయినా… సూక్షంగా వివరిస్తాను. కార్తీకమాసంలో పాటించాల్సిన పద్ధతులను గురించి చెబుతాను. శ్రద్ధగా వినండి. కార్తీకమాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉనప్పుడు శ్రీహరి ప్రీతికోసం మనకు ముక్తి కలగడానికి తప్పనిసరిగా నదీస్నానం ఆచరించాలి. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించాలి. తనకున్న దాంట్లో కొంచెమైనా దీపదానం చేయాలి. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థాలు తినరాదు. రాత్రులు విష్ణువాలయాల్లో గానీ, శివాలయాల్లో గానీ ఆవునేతితో దీపారాధన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తులై సర్వ సౌక్యాలను అనుభవిస్తారు. సూర్యుడు తులారాశిలో ఉన్న ఈ నెలరోజులు ఈ విధంగా పద్ధతులు పాటించేవారు జీవన్ముక్తులవుతారు. ఇలా ఆచరించే శక్తి ఉన్నా.. ఆచరించక పోయినా… భక్తి శ్రద్ధలతో కార్తీక నియమాలను పాటించేవారిని ఎగతాళి చేసినా… ధన సహాయం చేసేవారికి అడ్డుపడినా… వారు ఇహలోకంలో అనేక కష్టాలను అనుభవించడమేకాకుండా…. వారి జన్మాంతరంలో నరకంలోపడి కింకరులచే నానా హింసలపాలవుతారు. అంతేకాకుండా… వారు నూరు హీనజన్మలెత్తుతారు. కార్తీ కమాసంలో కావేరీ, గంగా, అఖండ గౌతమి నదుల్లో స్నానం చేసి, ముందు చెప్పిన విధంగా నిష్టతో కార్తీక నియమాల్ని పాటించేవారు జన్మాంతరాన వైకుంఠ వాసులవతుతారు. సంవత్సరంలో వచ్చే అని నెలల్లో కార్తీక మాసం ఉత్తమమైనది. అధిక ఫలదాయకమైనది. హరిహరాదులకు ప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాస వ్రతం వల్ల జన్మజన్మల నుంచి వారికున్న సకల పాపాలు తొలగిపోతాయి. నియమ నిష్టలతో కార్తీక వ్రతం ఆచరించేవారు జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇలా నెలరోజులు నియమాలు పాటించలేనివారు కార్తీక శుద్ధ పౌర్ణమినాడు తమ శక్తికొలదీ వ్రతమాచరించి, పురాణ శ్రవణం చేసి, జాగారం ఉండి…. మర్నాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే… నెలరోజులు వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ నెలలో ధనం, ధాన్యం, బంగారం, గృహం, కన్యాదానం చేసినట్లయితే… ఎన్నటికీ తరగని పుణఫ్యం లభిస్తుంది. ఈ నెలరోజులు ధనవంతుడైనా, పేద అయినా.. మరెవ్వరైనా హరినామ స్మరణను నిరంతరం చేయాలి. పురాణాలు వింటూ, పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలుచేయాలి. అలా చేసేవారు పుణ్యలోకాలను పొందుతారు. ఈ కథను చదివినవారికి శ్రీ మన్నారాయణుడు సకలైశ్వర్యాలను ఇచ్చి, వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు.

ఇతి శ్రీ స్కాంధ పురాణాంతర్గత వశిష్ట సంప్రోక్త కార్తీక మహత్యమందలి త్రింశోధ్యాయం సమాప్తం
ముప్ఫైయవరోజు (ఆఖరి రోజు) పారాయణం సమాప్తం

ఓం సర్వేషాం స్వస్తి ర్భ వతు ఓం సర్వేషాం శాంతి ర్భవతు
ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శ్శాంతి శ్శాంతి

Thursday, December 6, 2018

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)

అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంకోర్ రాజకుటుంబం అధ్యతలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తుంది.
 చరిత్ర
ట్రావంకోర్ రాజకుటుంబం చేరవాంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యాదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో(పద్మతీర్ధంలో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది(6వ శతాబ్ధం-9వ శతాబ్ధం). క్రీ.శ 16వ శతాబ్ధం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళా రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. (సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి మరియు సంపూర్ణ ఆనందం). ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర)ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.
అనంత సంపద
ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డి కాసుల వాడు... ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయం లో బయల్పడిన అనంత సంపద తో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆబరణాలు మొదలగు వాటితొ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలొ నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేస్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంకా బయట పడవలసిన సంపద వున్నందున పూర్తి స్థాయిలో సంపద నంతటిని లెక్కకట్టాల్సి వున్నది. ఆలయంలో దేవునికి సంబందించిన సంపద నేల మాళిగలలో దాచి వున్నది తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు. స్వాతంత్రానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్తానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్వవేక్షణ క్రిందనే వుంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఉత్తరదామ్ తిరుణాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా వున్నదని దాన్ని గాడిలో పెట్టాలని టి.పి. సుందర రాజన్ అనే న్యాయ వాది సుప్రీం కోర్టులో దావా వేయగా, సుప్రిం కోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపదస్ వెలుగు చూసింది. ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనె అనంతమై సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి వున్నది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచ బడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ క్రిష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ వున్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి వున్నది.
 చరిత్ర
అనంత పద్మనాభుడి ఆలయ

కార్తీకపురాణం - 29వ అధ్యాయం

కార్తీకపురాణం - 29వ అధ్యాయం

అంబరీషుడు దుర్వాసుని పూజించుట

అత్రి మహర్షి అగస్త్యులవారితో ఇలా చెబుతున్నారు… ”ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషుడికి అభయమిచ్చి, ఇద్దరినీ రక్షించి, భక్తకోటికి దర్శనమిచ్చి అంర్థానమైంది” అని ఇలా చెప్పసాగాడు…ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుడి పాదాలపై పడి దండప్రణామాలు ఆచరించాడు. పాదాలను కడిగి, ఆ నీటిని తన తలపై చల్లుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గంలో ఉన్న ఒక సామాన్య గృహస్తుడిని. నా శక్తి కొద్దీ నేను శ్రీమన్నారాయణుడిని సేవిస్తాను. ద్వాదశీ వ్రతం జేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఆపదా వాటిల్లకుండా ధర్మవర్తుడనై రాజ్యాన్ని పాలిస్తున్నాను. నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను క్షమించండి. మీ యందు నాకు అమితమైన అనురాగముండడం వల్ల మీకు ఆతిథ్యమివ్వాలని ఆహ్వానించాను. కాబట్టి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. నన్ను, నా వంశాన్ని పావనం చేయండి. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినా.. మరలా నా గృహానికి వచ్చారు. నేను ధన్యుడనయ్యాను. మీ రాక వల్ల శ్రీమహావిష్ణువు సుదర్శన చక్ర దర్శన భాగ్యం కలిగింది. అందుకు నేను మీ ఉపకారాన్ని మరవలేను. ఓ మహానుభావా! నా మనస్సెంతో సంతోషంగా ఉంది. అసలు మిమ్మల్ని ఎలా స్తుతించాలో కూడా పలుకులు రావడం లేదు. నా కంటివెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వాటితో మీ పాదాలను కడుగుతున్నాను. మీకు ఎంత సేవ చేసినా… ఇంకనూ మీకు రుణపడి ఉంటాను. కాబట్టి ఓ పుణ్య పురుషా! నాకు మరలా జన్మ అనేది లేకుండా… జన్మరాహిత్యం కలిగేట్లు, సదా మీ వంటి మునిశ్రేష్టులు, ఆ శ్రీమన్నారాయణుడి యందు మనస్సు గలవాడనయ్యేలా నన్ను ఆశీర్వదించండి” అని ప్రార్థించాడు. అనంతరం సహపంక్తి భోజనానికి రమ్మని ఆయన్ను ఆహ్వానించారు. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుడిని దుర్వాసుడు ఆశీర్వదించి… ”రాజా! ఎవరు ఎదుటివారి బాధను నివారించి, ప్రాణాలను కాపాడుతారో… ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారో… అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి, నీవు నాకు ఎంతో ఇష్టుడవు, తండ్రి సమానుడవయ్యావు. నేను నీకు నమస్కరించినచో నా కంటే చిన్నవాడగుట వల్ల నీకు ఆయుక్షీణమగును. అందుకే నీకు నమస్కరించడం లేదు. నీవు కోరిన ఈ కోరిక స్వల్పమైనదే. తప్పక నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశినాడు వ్రత నిష్టతో ఉండే నీకు మనస్థాపం కలుగజేసినందుకు వెంటనే నేను తగు ప్రాయశ్చిత్తం అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించేందుకు నీవే దిక్కయ్యావు. నీతో భోజనం చేయడం నా భాగ్యం” అన్నారు. ఆ తర్వాత అంతా కలిసి, పంచభక్ష్య పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించారు. దుర్వాసుడు అతని భక్తిని ప్రశంసించి, అనంతరం దీవించి, తన ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోయారు. తిరిగి అత్రి మహాముని అగస్త్యులవారితో ఇలా చెబుతున్నారు…. ”ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశిరోజున జరిగింది. ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహత్తుగలదో గ్రహించావా? ఆ దినాన విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేష శయ్యపైనుంచి లేస్తారు. ఆ రోజు ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యం, ఇతర దినాలలో పంచదానాలు చేసినంత ఫలితంతో సమానం. ఎవరైనా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి… పగలంతా హరినామ కీర్తనతో గడిపి, రాత్రి పురాణం చదువుతూ, లేదా వింటూ… జాగరణ చేసి, ఆ తర్వాతిరోజు అయిన ద్వాదశినాడు తన శక్తికొద్దీ శ్రీమన్నారాయణుడిని ధ్యానించి, ఆ శ్రీహరి ప్రీతికోసం దానాలిచ్చి, బ్రాహ్మలతో కలిసి భోజనం చేయాలి. అలా చేసేవారి సర్వపాపాలు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి. ద్వాదశి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి, ఆ రోజు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నా… ఆ ఘడియలు దాటకుండానే భోజనం చేయాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిరనివాసమేర్పరుచుకోవాలని కోరిక ఉంటుందో… వారు ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం చేయాలి. ఏ ఒక్కటీ విడువ కూడదు. శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్నివిధాలా శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది. అయినా… అదే గొప్ప వృక్షం అవుతుంది. అదేవిధంగా కార్తీకమాసంలో నియమానుసారంగా చేసే కొంచెం పుణ్యమైనా… అది అవసాన కాలమందు యమదూతల నుంచి కాపాడుతుంది. అందుకే.. ఈ కార్తీక మాస వ్రతం చేసి, దేవతలే కకుండా, సమస్త మానవులు తరించారు. ఈ కథను ఎవరు చదివినా… విన్నా… సకలైశ్వర్యాలు సిద్ధించి, ధన ప్రాప్తి కలుగుతుందని అత్రిమహర్షి సెలవిచ్చారు.

ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్యమందలి ఏకోనత్రింశోధ్యాయం సమాప్తం
ఇరవై తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం.

Wednesday, December 5, 2018

కార్తీకపురాణం - 28వ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ

కార్తీకపురాణం - 28వ అధ్యాయం 

విష్ణు సుదర్శన చక్ర మహిమ

వశిష్టుల వారు జనక మహారాజుతో తిరిగి ఇలా అంటున్నారు… ”ఓ జనక మహారాజా! విన్నావా? దుర్వాసుడి అవస్థలు! తాను ఎంతటి కోపవంతుడైనా… వెనకా ముందు ఆలోచించకుండా మహాభక్తుని శుద్ధని శంకించాడు. కాబట్టి ప్రయాసలపాలయ్యాడు. ఎంత గొప్పవారైనా… ఆచరించు కార్యక్రమాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి” అని చెబుతూ… అత్రి మహర్షి అగస్త్యునికి చెప్పిన వృత్తాంతాన్ని తిరిగి వివరిస్తున్నాడు…
అలా దుర్వాసుడు శ్రీమన్నారాయణుడి వద్ద సెలవు తీసుకుని, తనను వెన్నంటి తరుముతున్న సుదర్శన చక్రాన్ని చూసి, భయపడుతూ తిరిగి భూలోకానికి చేరుకుని, అంబరీషుడి వద్దకు పోయి… ”ఓ అంబరీషా! ధర్మపాలకా! నా తప్పును క్షమించి, నన్ను రక్షింపుము. నీకు నాపై ఉన్న అనురాగంతో ద్వాదశిపారాయణానికి నన్ను ఆహ్వానించావు. అయితే నేను నిన్ను కష్టాలపాలు చేశాను. వ్రతభంగం చేయించి, నీ పుణ్యఫలాన్ని నాశనం చేయాలనుకున్నా. కానీ, నా దుర్భుద్ధి నన్నే వెంటాడి, నా ప్రాణాలను తీయడానికి సిద్ధపడింది. నేను విష్ణువు వద్దకు వెళ్లి సుదర్శనం నుంచి కాపాడ మని ప్రార్థించాను. ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయం చేసి, నీ వద్దకు వెళ్లమని చెప్పాడు. కాబట్టి నీవే నాకు శరణ్యం. నేను ఎంతటి తపశ్శాలినైనా… ఎంతటి నిష్టావంతుడనైనా… నీ నిష్కళంక భక్తి ముందు సరిపోలను. నన్ను ఈ విపత్తు నుంచి కాపాడు” అని అనేక విధాలుగా ప్రార్థించాడు. అంబరీషుడు శ్రీ మన్నారాయణుడిని ధ్యానించి… ”ఓ సుదర్శన చక్రమా! నీకివే నా నమస్కారాలు. ఈ దుర్వాస మహాముని తెలిసో, తెలియకో తొందరపాటుగా ఈ కష్టాలను కొని తెచ్చుకున్నాడు. అయినా ఇతడు బ్రాహ్మణుడు. కాబట్టి, ఇతన్ని చంపకు. ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహించక తప్పదనుకుంటే… ముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ దుర్వాసుడిని చంపు. శ్రీ మన్నారాయణుడి ఆయుధానివి నీవు. నేను ఆ శ్రీహరి భక్తుడను. నాకు శ్రీ మన్నారాయణుడు ఇలవేల్పు. దైవం. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధాల్లో అనేక మంది లోక కంటకులను చంపావు. కానీ, శరణు కోరేవారిని ఇంతవరకు చంపలేదు. అందుకే… దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినా… ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు. కానీ, చంపలేదు. దేవా! సురాసురాది భూతకోటి ఒక్కటిగా ఏకమైనా… నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైనా అడ్డు లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలుసు. అయినా… మునిపుంగవుడికి ఏ అపాయం కలుగకుండా రక్షింపుము. నీయందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇమ ఇమిడి ఉంది. శరణు వేడిన ఈ దుర్వాసుడిని రక్షింపుమని నిన్ను వేడుతున్నాను” అని అనేక విధాలుగా స్తుతించాడు. అప్పటి వరకు అతి రౌద్రంతో నిప్పులు కక్కుతున్న విష్ణుచక్రం అంబరీషుడి ప్రార్థనకు శాంతించింది. ”ఓ భక్తాగ్రేసరా… అంబరీషా! నీ భక్తిని పరీక్షించడానికి ఇలా చేశానేతప్ప మరొకందుకు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను, దేవతలంతా ఏకమైనా చంపలేని మూర్ఖులను నేను దునిమాడటం నీకు తెలుసుకదా? ఈ లోకంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు శ్రీహరి నన్ను వినియోగించి, ముల్లోకాల్లో ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే… ముక్కోపి అయిన దుర్వాసుడు నీపై పగపట్టి, నీ వ్రతాన్ని భంగపరిచి, నశింపజేసి, నానా ఇక్కట్లు పెట్టడం, కన్నులెర్రచేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను గమనించాను. నిరపరాధివైన నిన్ను రక్షించి, ఈ ముని గర్వం అణచాలని తరుముతున్నాను. ఇతనూ సామాన్యుడు కాదు. రుద్రాంశం సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహా తపశ్శాలి. రుద్రతేజంతో భూలోకవాసులను చంపగల శక్తి ఆయనకుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తేజస్సు కలవాడు. వారుగానీ, నేనుగానీ, క్షత్రియ తేజస్సున్న నీవుగానీ, ఆయన ముందు సరితూగలేం. అయితే… తనకన్నా ఎక్కువ శక్తివంతులతో సంధిచేసుకోవడం ఉత్తమం. ఈ నీతిని ఆచరించు వారు ఎలాంటి విపత్తుల నుంచి అయినా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతా విస్మరించి, శరణార్థిగా వచ్చిన ఆ దుర్వాసుడిని గౌరవించి, నీ ధర్మం నీవు నిర్వర్తించు” అని సుదర్శనుడు పలికాడు.
ఆ మాటలకు అంబరీషుడు… ”నేను దేవ, గో, బ్రాహ్మణాదుల పట్ల, స్త్రీలపట్ల గౌరవభావంతో మెసలుకుంటాను. నా రాజ్యంలో సర్వజనులూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటాను. కాబట్టి శరణు కోరిన ఈ దుర్వాసుడిని, నన్ను రక్షించు. వేల అగ్నిదేవతలు, కోట్ల సూర్యమండలాలు ఏకమైనా… నీ శక్తికి, తేజస్సుకు సాటిరావు. నీవు అసమాన్య తేజోరాశివి. మహావిష్ణువు నీన్ను విశేష కార్యాలకు వినియోగిస్తాడు. లోక కంఠకులు, గోవధ చేసేవారు. బ్రహ్మ హత్యాపాతకులు, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు” అని ప్రార్థిస్తూ అంబరీషుడు చక్రాయుధానికి ప్రణమిల్లాడు. అంతట సుదర్శనుడు అంబరీషుడిని లేపి, ఆలింగనం చేసుకుని… ”అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రం త్రికాలాల్లో ఎవరైతే చేస్తారో.. ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాన్ని వృద్ధి చేసుకుంటారో… ఎవరు పరులను హింసించకుండా, పరధనంపై ఆశపడకుండా, పరస్త్రీని చెరపట్టకుండా, గోవధ, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాకాలను చేయకుండా ఉంటారో… వారి కష్టాలు తొలగిపోయి… ఈ లోకంలో, పరలోకంలో సుఖశాంతులతో తలతూగుతారు. కాబట్టి, నిన్నూ, దుర్వాసుడిని రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్య ఫలం ముందు ఈ మునిపుంగవుడి తపశ్శక్తి సాటిరాదు” అని చెప్పి అదృశ్యుడయ్యాడు.

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టామిశోధ్యాయ: సమాప్త
ఇరవయ్యెనిమిదో రోజు పారాయణం సమాప్తం

Tuesday, December 4, 2018

కార్తీకపురాణం - 27వ అధ్యాయం

కార్తీకపురాణం - 27వ అధ్యాయం

దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించమని శ్రీ హరి చెప్పుట

అత్రిమహాముని తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నాడు ”ఓ కుంభసంభవా! ఆ శ్రీ హరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు…” అని వృత్తాంతాన్ని వివరించారు. శ్రీ మహావిష్ణువు దుర్వాసునితో ఇలా చెబుతున్నాడు” ఓ దుర్వాస మహాముని! నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆపాది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారమెత్తుట కష్టం కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు. అందుకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను చింతతో ఉన్నాడు. బ్రాహ్మణ పరివృత్తుడైనందుకు ప్రాయోపవేశం (అగ్నిలో దూకి ఆత్మహత్య) చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది. ప్రజారక్షణే రాజధర్మం. ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితే… వాన్ని జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే.. మరో విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప, మరెవ్వరూ బ్రాహ్మణుడిని దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుడి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని ద్రవ్యం అపహరించేవాడు, బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు, విప్ర పరిత్యాగమొనర్చినవాడు బ్రహ్మ హంతకులే అవుతారు. కాబట్టి ఓ దుర్వాస మహర్షి! అంబరీషుని గురించి తప:శ్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. నేను బ్రహ్మ హత్యచేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్లు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది” అని విష్ణుదేవుడు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు.

ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్య మందలి సప్త వింశోధ్యాయం – ఇరవయ్యేడవ రోజు పారాయణం సమాప్తం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ROYAL KINGDOM GREEN HILLS

ROYAL KINGDOM GREEN HILLS Premium Frams, Tadkal, Sangareddy  Pin 8977111729

STARS

gtag('config', 'UA-93893754-1');