Monday, December 10, 2018

కేశవ నామాల విశిష్టత (01-12)

కేశవ నామాల విశిష్టత

కేశవ నామాల విశిష్టత*  (01-12)

మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ
 కేశవాయనమః
 నారాయణాయనమః,
 మాధవాయనమః
అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని, తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము. ఈ 24 కేశవ నామాలు  చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది. ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే  ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది. ప్రీతితో కార్యము చేస్తాము.

1. ఓం కేశవాయనమః*
(శంఖం _చక్రం_గద_పద్మం)
బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ, నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’ అనబడుతున్నాడు. ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న మొదటి అక్షరానికీ, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ, ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికీ, మార్గశీర్ష మాసానికీ,శుక్ల పక్షంలో లలాటం మీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ, మేషరాశికీ, ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు.

*2. ఓం నారాయణాయనమః* 
(పద్మం_గద_చక్రం_శంఖం)
నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’. ఆయన చేత, సృష్టించబడిన జలం ‘నార’ అనబడుతోంది. ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు. ఈయన వాసుదేవ మహ రామంత్రంలోని ‘న’ అక్షరానికీ, గాయత్రిలోని ‘స’ అన్న అక్షరానికీ, మహత్తత్వానికీ, పౌష్యమాసానికీ, శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ, వృషభ రాశికీ, పరమాన్నానికీ, ప్రాతఃకాలానికీ  నియామకుడు.

*3. ఓం మాధవాయ నమః*
(చక్రం_శంఖం_పద్మం_గద)
‘మధు’నామక యదువంశ శాఖలో జన్మించడం వల్లా, రమాదేవికీ పతి అయినందువల్లా, సర్వోత్తముడు అయినందువల్లా, శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు. ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని ‘మో’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని ‘వి’ అన్న అక్షరానికీ, అహంకారతత్వానికీ, మాఘమాసానికీ, శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ, మిథునరాశికీ, భక్ష్యాలకూ నియామకుడు.

*4. ఓం గోవిందాయ నమః*
(గద_పద్మం_శంఖం_చక్రం)
వేదాల మూలంగా పొందబడేవాడూ, భూమినీ, గోవులనూ రక్షించేవాడూ, మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు. ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని 'భ’ అన్న అక్షరానికీ’ గాయత్రిలోని “తుః” అన్న అక్షరానికీ, మనస్తత్త్వానికీ, పాల్గుణ మాసానికీ, శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ, కర్కాటక రాశికీ, నేయికీ నియామకుడు.

*5. ఓం విష్ణవే నమః*
(పద్మం_శంఖం_చక్రం_గద)
జ్ఞానానందాది సమస్త గుణాలతో, దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు. ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని ‘గ’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని ‘వ’ అన్న అక్షరానికీ కర్ణతత్త్వానికీ, చైత్రమాసానికీ, శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ, సింహరాశికీ, పాలకూ నియామకుడు.

*6. ఓం మధుసూదనాయ నమః
    (శంఖం_పద్మం_గద_చక్రం)
“మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా, సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి ‘మధుసూదనుడు’  అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలో ని‘వ’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని ‘రే’ అన్న అక్షరానికీ, త్వక్ తత్త్వానికీ, వైశాఖమాసానికీ, శుక్లపక్షంలో కుడిస్తనం మీద ధరించే నామానికీ, కన్యారాశికీ, మధుర భక్ష్య విశేషానికీ నియామకుడు. ఈ మధుసూదనుడు ‘హస్తిని’ నాడిలో ఉంటాడు

*7. ఓం త్రివిక్రమాయ నమః*
 (గద_చక్రం_శంఖం_పద్మం)
మూడు వేదాలనూ, మూడు కాలాలనూ, సత్త్వాది మూడు గుణాలనూ, భూరాది మూడు లోకాలనూ, త్రివిధ జీవులనూ, చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు. వాసుదేవ మహామంత్రంలోని “తే” అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘ణి’ అన్న అక్షరానికీ, నేత్ర తత్త్వానికీ, జ్యేష్ఠమాసానికీ, శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ, తులా రాశికీ, వెన్నకూ నియామకుడు.

*8. ఓం వామనాయ నమః*
(చక్రం_గద_పద్మం_శంఖం)
అపేక్షిత సుఖాలనూ, అభీష్టాలనూ కరుణించేవాడూ, మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘వామనుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘వా’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘ యం’ అన్న అక్షరానికీ  జిహ్వా తత్త్వానికీ, ఆషాడమాసానికీ, శుక్ల పక్షంలో కంఠం కుడి వైపున ధరించే నామానికీ, వృశ్చికరాశికీ, పెరుగుకూ నియామకుడు.

*9. ఓం శ్రీధరాయ నమః*
(చక్రం_గద_శంఖం_పద్మం)
శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా, పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి ‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘సు’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘భ’ అన్న అక్షరానికీ, ఘ్రాణ తత్త్వానికీ, శ్రావణమాసానికీ, శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో  ధరించే నామానికీ, ధనూరాశికీ, ముద్దపప్పుకూ నియామకుడు.

*10. ఓం హృషీకేశాయ నమః*
(చక్రం_పద్మం_శంఖం_గద)
ఇంద్రియ నియామకుడూ, రమ, బ్రహ్మ, రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’  అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’ అన్న అక్షరానికీ,గాయత్రిలోని ‘ర్గో’ అన్న అక్షరానికీ, వాక్‍తత్త్వానికీ, భాద్రపద మాసానికీ, శుక్లపక్షంలో ఎడమ భుజం మీద ధరించే నామానికీ, మకర రాశికీ, ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు.

*11. ఓం పద్మనాభాయ నమః*
(పద్మం_చక్రం_గద_శంఖం)
నాభిలో పద్మాన్ని కలిగినవాడూ, భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ, సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల శ్రీ హరి ‘పద్మనాభుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘దే’ అన్న అక్షరానికీ, పాణితత్త్వానికీ, ఆశ్వయుజ మాసానికీ, శుక్ల పక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ, కుంభరాశికీ, కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు.

*12. ఓం దామోదరాయ నమః*
(శంఖం_గద_చక్రం_పద్మం) 
యశోద చేత పొట్టకు బిగించబడిన తాడు గలవాడూ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ, దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ, దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ, దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందువల శ్రీహరి ‘దామోదరుడు’ అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘య’ అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘వ’ అన్న అక్షరానికీ, పాదతత్త్వానికీ, కార్తీక మాసానికీ, శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ, మీన రాశికీ, అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు.

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS