తిరుప్పావై పదహారవ రోజు పాశురము
నాయగనాయ్ నిన్ఱనన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుమ్ తోరణ
వాశల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
ఆయర్ శిఱుమియరో ముక్కు; అఱైపఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్;
తూయోమాయ్ వన్దోమ్, తుయలెళ పాడువాన్,
వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే, అమ్మా! నీ,
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.
భావం
మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా! మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసినవారము. గొల్లకులమయిన పుట్టిన అజ్ఞానులమైననూ స్వామి యందత్యదిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్ఠితుడును. ఇంద్రనీల మణివర్ణముగల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు 'పఱై' అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగ సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ! నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక ధృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకొంటున్నారు.
అవతారిక
ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తియై యీ 16వ మాలికతో మూడవ దశ ప్రారంభమౌతుంది. నిద్రిస్తున్న గోపికలనందరను మేల్కొలిపి, అందరను వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి, వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి, అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివానిని లేపుచున్నారు. పెద్దలు చేయని పనిని చేయమని' కదా ప్రతిజ్ఞ. దానినాచరించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు. భాగవతుల పురస్కరించుకొని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో, శూర్పణఖవలె పరాభవము నొందవలసిందేకదా! అనగా పురుషకారమును పురస్కరించుకొనకుండ పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలెను కదా! భగవంతుని చేరటానికి ముందు ఆచార్యు నాశ్రయించవలెను కదా! నిరహంకారులై ఆచార్యునాశ్రయించినవారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకొన్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతనిద్వారా శ్రీకృష్ణపరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు.
దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి, మొదట క్షేత్రపాలకుని దర్శించాలి. పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారినీ సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం వుంది. మనస్సునదుపులో వుంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాళ్ తల్లి మనకు చెప్తున్నది (పాశురంలో)
(ఖరహరప్రియ - ఏకతాళము)
ప.. మా ప్రభుడౌ నందుని తిరు మాళగ రక్షించువాడ!
సుప్రకాశ ధ్వజతోరణ ద్వారము గాచేటివాడ!
ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!
సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!
చ.. గొల్ల పిల్లలను మాకు నల్లని కృష్ణయ్య నిన్న
అల్లన మ్రోగేటి వాద్య ముల్ల మలర నిత్తుననెను.
చెల్లని మాటల నోటను మెల్లగ జెప్పగబోకుమ!
నల్లనయ్య కృష్ణయ్యను మెల్లగ దర్శింపరాగ
ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!
సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!