తిరుప్పావై పదిహేడవ రోజు పాశురము
అమ్బరమే తణ్ణీరే! శోఱే! అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళిందిరాయ్
కొంబనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే
ఎమ్బెరు మాట్టి యశోదాయ్! అఱివుఱాయ్
అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద
ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్
శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా; బలదేవా
ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్
భావం
ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న, వస్త్ర, తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను 'స్వామి! మేలుకొను' మని ప్రార్ధించారు. తరువాత 'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును, తీగవలె ముఖ్యమైనదానా! గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా! మాకును స్వామినివైన ఓ యశోదమ్మా! లేమ్మా!' అని వేడుకొనిరి. 'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణా! ఇక నిద్ర చాలునయ్యా! మేలుకో!' అని ప్రార్ధించిరి. ఆయన వేళకుండుట చూచి, బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి 'మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బాలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును యింకను నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండు!' అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు.
అవతారిక
ద్వారపాలకుని వేడి, అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచట యింకను నిద్రిస్తున్న శ్రీనందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరామునీ శ్రీకృష్ణునీ చూచారు - వారినందరను ఒక్కొక్కరిగా మేలుకొముపుటయే యీ (పాశురంలో) వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేల్కొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వానిని అనుగ్రహించమని ప్రార్ధిస్తున్నారు. ఇట నందగోపుడే సదాచార్యుడు. వానినాశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక యశోదమ్మను మేల్కొలిపి - అనగా మంత్రాన్ననుష్టించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కాని జరిగిన పొరపాటున గ్రహించి ప్రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమేకదా! వారిని ప్రార్ధిస్తున్నారీ పాశురంలో.
(ఆనందబైరవి రాగము - ఝంపెతాళము)
ప.. లేవయ్యా మా స్వామి! నందగోపాలా!
లేవయ్యా స్వామి! మా సర్వప్రదాతా!
అ..ప.. లేవమ్మ మాయమ్మా! లే యశోదమ్మా!
లేవె! స్త్రీ జాతి కంతకును తలమానికమ!
చ.. ఆకాశమున జీల్చి లోకాల గొలిచిన శ్రీకృష్ణ!
మేలుకో! నిత్య సూరుల స్వామి!
శ్రీ కీర్తి కంకణాల్ ధరియించు బలదేవ!
ఇంక నిదురింపకుమ! లెమ్ము! కృష్ణుని తోడ!
లేవయ్య మా స్వామి! నందగోపాలా!
లేవయ్య స్వామి మా సర్వప్రదాతా!