శ్రీ గరుడ పురాణము
" మనెను. దానికి గరుడుడు " నా తల్లి దాస్య విముక్తి కై ఈ పని చేయుచున్నాను. దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో నా తల్లి విముక్తురాలగును." అనెను . " ఐనచో నీవు దీనిని నీ సవతి తల్లికిమ్ము ఆమె, నీ తల్లికి దాస్య విముక్తి యైనదని చెప్పగానే, అదృశ్య రూపుడనై వచ్చి ఈ యమృత కలశమును గొని పోయెదను. దీనికి నీవంగీకరింపుము" అనెను. గరుడుడు ఒప్పుకొనెను. అమృత భాండమును కద్రువ చేతిలో బెట్టి, " మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా !" అనగా ఆమె అవుననెను. వెంటనే ఆమె చేతిలోని అమృత కలశము అదృశ్య మై పోయెను. అనగా ఇంద్రుడపహరించెను.
ఈ విధముగా తల్లికి స్వాతంత్ర్యము కలిగించిన గరుడుడు తల్లి దీవెనలు పొంది తండ్రి దగ్గరకు వెళ్లి విషయము నంతను వివరించెను. ఆయన తన కుమారుని పరాక్రమ విశేషములకు సంతోషించి," కుమారా ! ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుని గూర్చి తపము చేసి యనుగ్రహము సంపాదింపుము. ధర్మవర్తనుడవై యుండుము. నీకు త్రిలోక ము లందును ఎదురుండదు." అని చెప్పెను. తండ్రి హిత భోదను విని గరుడుడు శ్రీ హరిని గూర్చి తీవ్రమైన తపము చేసెను. చాలాకాలము అట్లు చేయ శ్రీనాధుడు ప్రత్యక్షమై "గరుడా ! నీ భక్తికి మెచ్చినాను. నీవు నాకు వాహనమై యుండి నేను చెప్పిన పనులు నిర్వర్తింపు చుండుము." అని వరమిచ్చి తనకు వాహనముగా జేసికొనెను.
గరుడుని గర్వ భంగము
ఒకప్పుడు గరుత్మంతునికి, తాను మహా బలవంతుడనని గర్వము కలిగెను. తాను తక్కువవాడా ? గజ కచ్చపములను చెరియొక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరము ఎగురుట, అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమున నున్న అమృతమును దెచ్చుట, ఇంద్రుని వజ్రాయుధమునకు బెదర కుండుట సామాన్య విషయములా ? అవన్నియు ఎందుకు ? సకల బ్రహ్మాండ భాండములను తన కడుపులో బెట్టుకున్న ఆ శ్రీ మహా విష్ణువును అనాయాసముగా వహించుచు లోకములన్నియు దిరుగుచున్న తన కంటే బలవంతుడీ చతుర్దశ భువనములలో ఇంకెవడున్నాడని గర్వ పడ సాగెను. దానితో అందరిని కొంత చులకనగా జూచుచు ప్రవర్తింప జొచ్చెను. ఇది నారాయణుని దృష్టిలో బడినది . ఇతనికెట్లయినను గర్వ భంగము చేయవలెనని సంకల్పించెను.
ఒకనాడు నారదాది మునులు శ్రీ పతిని దర్శించుటకై వచ్చిరి. విష్ణుమూర్తి వారితో మాటలాడుచు అలవోకగా ప్రక్కనున్న గరుడునిపై చేయి వేసెను. మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను. గరుడునికి విష్ణుమూర్తి చేయి భరించ లేనంత బరువుగా నుండెను. ప్రాణములు కడ బట్టు చుండెను. సంభాషణ ఎంతసేపు సాగినదో కాని గరుడు డీలోపున ప్రాణ వశిష్టు డయ్యెను. ఎప్పటికో మునులు సెలవు దీసుకుని వెళ్ళిరి. శ్రీ హరి అప్పుడా చేయి గరుడుని మీద నుండి తీసెను. గరుడప్పటికే సొమ్మసిల్లి పడిపోయెను.
శ్రీ హరి అతనిని మృదువుగా సృశించెను. గరుడుడా స్పర్శతో తేరుకుని, విష్ణు మూర్తి పాదములపై బడి," ఓ మహాపురుషుడా ! నీకన్న సృష్టిలో అధికు లెవ్వరును లేరు ఈ పరమార్ధమును గ్రహింపలేక గర్వాందుడనైన నాకు సరియైన పాటమును చెప్పితివి, నా యాపరాధమును మన్నింపు " మని వేడుకొనెను. శ్రీ హరి ప్రసన్నుడయ్యెను
నవగ్రహములు - రత్నములు
సూర్యాది నవగ్రహములకును తొమ్మిది విధములైన రత్నములు నిర్దేశింప బడినవి .ఆకాశములో నున్న ఈ గ్రహముల కాంతులు సరిగా మనపై ప్రసరింపక పోవచ్చును. ఆ కాంతులు మన శరీరముపై బడినచో అనేక అనారోగ్యములు తొలగుటయే కాక ,ఆయా గ్రహములు విషమ స్థానములందున్నచో సత్ఫలితములను, మంచి స్థానము లందున్నచో విశేష ఫలములను కలిగించును. అందుచేత నవరత్నముల ఉంగరములను ధరించుట నవగ్రహ ప్రీతి కొరకే అని గ్రహింప వలెను. ఆయా గ్రహములకు చెప్పబడిన రత్నములు క్రింద నీయబడు చున్నవి .
1 .సూర్యుడు -- పద్మరాగము (కెంపు)
2 . చంద్రుడు -- ముత్యము
3 .అంగారకుడు - పగడము
4 .బుధుడు -- ఆకుపచ్చ
5 .గురుడు --పుష్యరాగము (గరుడ పచ్చ )
6 .శుక్రుడు --వజ్రము
7 .శని -- నీలము (ఇంద్ర నీలము )
8 .రాహువు - గోమేధికము
9 . కేతువు -- వైడూర్యము
పంచ మహా యజ్ఞములు
"యజ ఆరాధనే ", అను ధాతువు నుండి పుట్టినది యజ్ఞ శబ్దము పృధ్విలో పుట్టిన ప్రతి మానవుడు ను ప్రతి దినమును ఈ యజ్ఞములు ఆచరించ వలెను. ఈ యజ్ఞములు ఐదు .1 . దేవ యజ్ఞము 2 . పిత్రు యజ్ఞము 3 . భూత యజ్ఞము 4 . మనుష్య యజ్ఞము 5 . బ్రహ్మ యజ్ఞము .