Wednesday, December 12, 2018

కేశవ నామాల విశిష్టత (13-24)

కేశవ నామాల విశిష్టత

కేశవ నామాల విశిష్టత (13-24)

*13. ఓం సంకర్షణాయ నమః*
(శంఖం_పద్మం_చక్రం_గద)
భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి ‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు. ఈ యన గాయత్రిలోని‘స’ అన్న అక్షరానికీ, పాయు తత్త్వానికీ, కృష్ణ పక్షంలో నుదిటిపై ధరించే నామానికీ, ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ, మనోమయ కోశానికీ, క్షత్రియవర్ణానికీ, స్త్రీశరీరానికీ, ఋతు సామాన్యానికీ, రుద్రునికీ, మధ్యాహ్నసవనానికీ, ఆవేశ రూపాలకూ, రాజస ద్రవ్యాలకూ, త్రేతాయుగానికీ, శరదృతువుకూ నియామకుడు.

*14. ఓం వాసుదేవాయ నమః*
(శంఖం_చక్రం_పద్మం_గద)
త్రిలోకాలకూ ఆవాస స్థానమైనవాడూ, సర్వాంతర్యామీ, సర్వశక్తుడూ, సర్వచేష్టకుడూ, సర్వాభీష్టప్రదుడూ, యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ, వసుదేవ సుతుడూ అయినందువల్ల శ్రీ హరి ‘వాసుదేవుడు’ అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘ధీ’ అన్న అక్షరానికీ, ఉపస్థ తత్త్వానికీ, కృష్ణపక్షంలో ఉదర మధ్యంలో ధరించే నామానికీ, పంచదారకూ, బెల్లానికీ, బ్రాహ్మణవర్గానికీ, పురుషశరీరానికీ, సాయంసవనానికీ, అవతార రూపాలకూ, శుభద్రవ్యాలకూ, కృతయుగానికీ, హేమంత ఋతువుకూ నియామకుడు.

*15. ఓం ప్రద్యుమ్నాయ నమః*
(శంఖం_గద_పద్మం_చక్రం)
అసదృశమైన కాంతీ, యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’ అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘మ’ అన్న అక్షరానికీ, శబ్ద తత్త్వానికీ, కృష్ణ పక్షంలో హృదయ భాగంలో ధరించే నామానికీ, వడపప్పు మొదలైన పదార్థాలకూ, వైశ్యవర్ణానికీ, స్త్రీ శరీరానికీ, అయనానికీ, ప్రాతఃసవనానికీ, లీలారూపాలకూ, పీతవర్ణ ద్రవ్యాలకూ, ద్వాపర యుగానికీ, వర్ష ఋతువుకూ నియామకుడు.

*16. ఓం అనిరుద్ధాయ నమః*
(గద_శంఖం_పద్మం_చక్రం)
ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ, సర్వ శక్తుడూ, గుణ పూర్ణుడూ, మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ, జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ, వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’ అనబడుతున్నాడు. ఈ యన గాయత్రిలోని‘ హి’ అన్న అక్షరానికీ, స్పర్శ తత్త్వానికీ, కృష్ణ పక్షంలో కంఠమధ్య భాగంలో ధరించే నామానికీ, చేదుపదార్థాలకూ, శూద్ర వర్ణానికీ, అన్నమయకోశానికీ, భోగ్య వస్తువులన్నింటికీ, అబ్దానికీ,           నల్లని ద్రవ్యాలకూ, కలియుగానికీ,  గ్రీష్మ ఋతువుకూ నియామకుడు.

*17. ఓం పురుషోత్తమాయ నమః*
(పద్మం_శంఖం_గద_చక్రం)
దేహ నాశంగల సర్వ జీవులూ క్షర పురుషులు. ఏ విధమైన నాశనమూ లేని అప్రాకృత శరీరంగల శ్రీమహాలక్ష్మి దేవి అక్షర పురుష. ఈ ఉభయ చేతనుల కంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీ హరి‘ పురుషోత్తముడు’ అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని ‘థి’ అన్న అక్షరానికీ, రూప తత్త్వానికీ, కృష్ణ పక్షంలో ఉదరం కుడిభాగం మీద ధరించే నామానికీ, ఇంగువ, యాలకులు, ఆవాలు, కర్పూరాలకూ నియామకుడు.

*18. ఓం అధోక్షజాయ నమః*
(గద_శంఖం_చక్రం_పద్మం)
ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదులవల్ల ప్రాదుర్భవించినవాడూ, నిత్యజ్ఞాన స్వరూపుడూ, అక్షయ కుమారుడిని సంహరించిన హనుమంతుడి చేత తెలియబడేవాడూ  అయినందువల్ల  శ్రీ హరి    ‘అధోక్షజుడు’ అనబడుతాడు. ఈయన గాయత్రిలోని‘యో’ అన్న అక్షరానికీ, రసతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ, పాలకూ, పానకమూ, మజ్జిగకూ, పచ్చి పులుసుకూ, నేతితో, నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు.

*19. ఓం నారసింహాయ నమః*
(పద్మం_గద_శంఖం_చక్రం)
నరుడిలాగా, సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగి వున్నందువల్ల శ్రీ హరి ‘నారసింహుడు’ అనబడుతాడు.
ఈయన గాయత్రిలోని ‘యో’ అన్న అక్షరానికీ, గంధ తత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ, బూడిద గుమ్మడికాయ, నువ్వులు, మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ, ఈశాన్య దిక్కుకూ నియామకుడు.

*20. ఓం అచ్యుతాయ నమః*
(పద్మం_చక్రం_శంఖం_గద)
శుద్ధ జ్ఞానానందాలే దేహంగా కలవాడూ, సకల గుణ పరిపూర్ణుడూ, సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ, దోషరహితుడూ అయినందువల్లా శ్రీ హరి ‘అచ్యుతుడు’ అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని‘నః’ అన్న అక్షరానికీ, ఆకాశ తత్త్వానికీ, కృష్ణ పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ, ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు. 

*21. ఓం జనార్థనాయ నమః*
(చక్రం_శంఖం_గద_పద్మం)
సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు, కైటభ, హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ,  మోక్షప్రదుడూ,     జన్మలేనివాడూ,    సంసార దుఃఖాన్ని పరిహరించేవాడూ, సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీ హరి ‘జనార్ధనుడ’ య్యాడు. ఈ జనార్ధనుడు గాయత్రి లోని ‘ప్ర’ అన్న అక్షరానికీ, వాయుతత్త్వానికీ, కృష్ణ పక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ, ఉప్పుకూ, నైరుతి దిక్కుకూ నియామకుడు.

*22. ఓం ఉపేంద్రాయ నమః*
(గద_చక్రం_పద్మం_శంఖం)
ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి  ‘ఉపేంద్రుడు’   అనబడుతున్నాడు. ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని ‘చో’; అన్న అక్షరానికీ, తేజో తత్త్వానికీ, కృష్ణ పక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ, అరటిపండు, కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ, వాటి రసాలకీ, తూర్పు దిక్కుకూ నియామకుడు.

*23. ఓం హరయే నమః*
(చక్రం_పద్మం_గద_శంఖం)
భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడం చేత నారాయణుడు ‘హరి’ అనబడుతున్నాడు. ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ, అపో తత్త్వానికీ, కృష్ణపక్షంలో ఎడమ భుజం మీద ధరించే నామానికీ, తాంబూలానికీ నియామకుడు.

*24. ఓంకృష్ణాయనమః*
(గద_పద్మం_చక్రం_శంఖం)
సృష్టి, స్థితి, సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ, పూర్ణానందస్వరూపుడూ,  నీలవర్ణ దేహ కాంతి కలవాడూ అయినందువల్ల శ్రీహరి “కృష్ణుడు” అనబడుతున్నాడు.
ఈ కృష్ణుడు గాయత్రిలోని ‘యాత్’ అన్న అక్షరానికీ, పృథ్వీ తత్త్వానికీ, కృష్ణ పక్షంలో మెడ మీద ధరించే నామానికీ, త్రాగే నీటికీ, దైహిక కర్మకూ    నియామకుడు.
*🦑ఓం.. నమో... శ్రీ వేంకటేశాయా !!!* 🦑

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS