తిరుప్పావై రేపటి ఏడవ పాశుర అనుసందానము
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్
భావం
భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదాయని తెల్లవారుఝామున కలిసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆ మాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా !ఓ పిచ్చిదానా ! కుసుమాలంకృతములగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులుగల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు, వారిచేతుల కంకణ ధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి, విజ్రుంభించి, ఆకాశామంటుచున్నవి. ఆధ్వనిని వినలేదా ? ఓ నాయకులారా ! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కనపడవలెనని మూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపచేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా ? నీ తేజస్సు మాకు కనపడుచున్నది. దానినడ్డగింపక మేము దర్శించి అనుభవించునట్లు తలుపు తెరువ వలయును.
అవతారిక
భగవదనుభవము నిత్యనూతనమై మొహపరచుచుండును. పక్షులు తెల్లవారుఝామున మేల్కొంటున్నాయి. ఈనాటి పాశురంలో గోదాదేవి భరద్వాజ పక్షులద్వార, అవిచేసే మధురధ్వనులు ద్వారా పొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ భారద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందు ఆసక్తి కలగాలంటే శాస్త్రవిషయాలు తెలుసుకోవలసిందేకదా ! వీటిని తెలుసుకొని భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవీ ఆటంకాలు కావు అని, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతము చేయుటకు రండి అని పిలుస్తోంది.