తిరుప్పావై రేపటి పదునాలుగవ పాశుర అనుసందానము
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
భావం
స్నానము చేయుటకు గోపికల నందరును లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఈ పాశురములో మేల్కొల్పుచున్నారు. ...... ఓ పరిపూర్ణురాలా ! నీ పెరటి తోటలో దిగుడుబావిలో ఎర్ర తామరలు వికసించినవి. నల్లకలువలు ముడుచుకొనిపోవుచున్నవి. లెమ్ము .... ఎఱ్ఱని కాషాయములను దాల్చి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమతమ ఆలయములలొ ఆరాధనము చేయుటకై పోవుచున్నారు లెమ్ము. ముందుగా నీవు మేల్కొని వచ్చి, మమ్ములను లేపుదువు అని మాట ఇచ్చినావు కదా ? మరచితివా ? ఓ లజ్జా విహీనురాలా ! లెమ్ము , ఓ మాట నేర్పుగలదానా ! శంఖమును - చక్రమును ధరించిన వాడును, ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచిరమ్ము.
అవతారిక
ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపెదనని చెప్పిన ఒకగోపిక మేల్కొల్పబడుచున్నది. ఈమె వీరి సంఘమునకు అంతకు నాయకురాలై నడిపింపగల శక్తి గలది, తన పూర్ణానుభవముచే ఒడలు మరచి తాను చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరించి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తను ఉండిపోయెను. ఈమె ఇంటిలో ఒకపెద్ద తోట కలదు. పెరటి వైపున ఉన్న ఆ తోటలో దిగుడుబావి కలదు. ఆ దిగుడుబావిలో తామరపూవులు, కలువపూవులు ఉన్నవి. ఆమె తన్మయతతో అనుభవించుచు ఇతరములను మరచి ఉండెను. అట్టి స్థితిలో ఉన్న గోపికను ఈరోజు మేలుకొలుపుచున్నారు.