Friday, November 23, 2018

కార్తీకపురాణం 16వ అధ్యాయం

కార్తీకపురాణం 16వ అధ్యాయం
కార్తీకపురాణం 16వ అధ్యాయం
స్తంభదీప ప్రశంస


తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా చెబుతున్నాడు… ”ఓ మహారాజా! కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ నెలలో స్నాన, దాన, వ్రతాదులను చేయడం, సాలగ్రామ దానం చేయడం చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసంలో తనకు శక్తి ఉన్నా దానం చేయరో… అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుతారు. ఈ నెలరోజులు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగా నెలలో ఏ ఒక్కరోజూ విడవకుండా తులసి కోటవద్దగానీ, భగవంతుని సన్నిధిలోగానీ దీపారాధన చేసినట్లయితే సమస్త పాపాలు నశిస్తాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమిరోజు నదీస్నానమాచరించి, భగవంతుడి సన్నిధిలో ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాలు, నారీకేళ ఫలాలు దానం చేసినట్లయితే… చిరకాలం నుంచి సంతానం లేనివారికి పుత్ర సంతానం కలుగుతుంది.
సంతానం ఉన్నవారు ఇలా చేస్తే… వారికి సంతాన నష్టమనేది ఉండదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ నెలలో ధ్వజస్తంభంలో ఆకాశ దీపం వెలిగించినవారు వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీకమాసమంతా ఆకాశదీపంగానీ, స్తంభదీపంగానీ పెట్టి, నమస్కరించిన స్త్రీపురుషులకు సకలైశ్వర్యాలు కలిగి, వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆకాశదీపం పెట్టేవారు శాలిదాన్యంగానీ, నువ్వులుగానీ ప్రమిద అడుగున పోయాలి. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు, లేదా దీపం పెట్టేవారిని పరిహాసం చేసేవారు చుంచు జన్మ ఎత్తుతారు. ఇందుకు ఒక కథ ఉంది… చెబుతాను. సావధానంగా విను…” అని ఇలా చెప్పసాగాడు….
దీపస్తంభం.. విప్రుడగుట
రుష్యాగ్రగణ్యుడైన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, దానికి దగ్గర్లో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించారు. నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే మునులు కూడా అక్కడకు వచ్చి పూజాదికాలు నిర్వహించేవారు. ఒకరోజు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కినవారిని చూసి… ”ఓ సిద్ధులారా! కార్తీకమాసంలో హరిహరాదుల ప్రీతికోసం స్తంభదీపం పెట్టిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా! రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికోసం ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి, దానిపై దీపం పెడదాం. అంతా కలిసి అడవికి వెళ్లి, నిడుపాటి స్తంభం తీసుకువద్దాం” అని కోరారు. అందుకు అంతా సంతసించి, పరమానందభరితులై అడవికి వెళ్లి, చిలువలు, వలువలు లేని ఓ చెట్టును మొదలు నుంచి నరికి, దాన్ని తీసుకొచ్చి, ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు. దానిపై శాలి ధాన్యముంది, ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి, అందులో వత్తిని వేసి, వెలిగించారు. ఆ తర్వాత వారంతా కూర్చుని పురాణ పఠనం చేయసాగారు. అంతలో ”ఫళఫలా”మనే శబ్ధం వచ్చింది. వారు అటు చూడగా… వారు పాతిన స్తంభం పడిపోయి ముక్కలై కనిపించింది. దీపం కూడా ఆరిపోయి, చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ దృశ్యం చూసినవారంతా ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. మునులంతా అతన్ని చూసి, ఆశ్చర్యంతో ”ఓయీ… నీవెవరవు? నీవీ స్తంభం నుంచి ఎలా వచ్చావు? నీ కథేంటి?” అని ప్రశ్నించారు.
దానికి ఆ పురుషుడు మునులందరికీ నమస్కరించి, ”పుణ్యాత్ములారా! నేను కిందటి జన్మలో బ్రాహ్మణుడను. ఒక జమిందారుగా సకలైశ్వర్యాలతో తలతూగాను. నాపేరు ధన లోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వల్ల మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలేక ప్రవర్తించాను. దుర్భుద్ధుల వల్ల వేదాలను చదవక, శ్రీహరిని పూజింపక, దానధర్మాలు చేయకుండా ఉంటిని. నేనను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో ఎవరైనా విప్రులు వచ్చినా… వారితో నా కాళ్లను కడిగించి, ఆ నీటిని వారి తలపై వేసుకునేలా చేసి, నానా దుర్భాషలాడేవాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుని, అతిథులను నేలపై కూర్చోమని చెప్పేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హనీంగా చూసేవాడిని. జనాలంతా నా చేష్టలకు భయపడేవారు. నన్ను మందలించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. నేను చేసే పాపకార్యాలకు హద్దులేకపోయింది. ధర్మాలంటే ఏమిటో నాకు తెలియదు. ఇంత దుర్గార్గుడిగా, పాపిగా జీవితం గడిపి, అవసాన దశలో చనిపోయాను. ఆ తర్వాత ఘోర నరకాలు అనుభవించి, లక్ష జన్మలలో కుక్కగా, పదివేల జన్మలు కాకిగా, అయిదువేల జన్మలు తొండగా, అయిదు వేల జన్మలు పేడ పెరుగుగా, తర్వాత వృక్ష జన్మమెత్తి అరణ్యంలో కూడా ఉన్నాను. అయినా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవల్ల స్తంభంగా ఉన్న నేను నా రూపమెత్తి, జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేశాను. నన్ను మన్నించండి” అని వేడుకొన్నాడు. ఆ మాటలు విన్న మునులంతా అమిత ఆశ్చర్యం పొందారు. ”ఆహా! కార్తీకమాసం మహిమ ఎంత గొప్పది ? అంతేకాకుండా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యంకాదు. కర్రలు, రాళ్లు, స్తంభాలు కూడా మన కళ్ల ఎదుట ముక్తిని పొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ దీపముంచిన వైకుంఠప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. అందువల్లే ఈ స్తంభానికి  ముక్తికలిగింది” అని మునులు అనుకుంటుండగా… ఆ పురుషుడు మళ్లీ ఇలా మాట్లాడుతున్నాడు… ”ఓ మునులారా…! నాకు ముక్తి కలుగు మార్గమేమైనా ఉందా? ఈ జగంలో ఎల్లరకూ కర్మబంధం ఎలా కలుగుతుంది? అది ఎలా నశిస్తుంది? నా సంశయాన్ని తీర్చండి” అని ప్రార్థించారు. అంత అక్కడున్న మునులంతా… తమలో ఒకరగు అంగీరసమునితో ”స్వామీ…! మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు. కాబట్టి వివరించండి” అని కోరిరి. అంతట ఆయన వారి సంశయాన్ని తీర్చేందుకు అంగీకారం తెలిపాడు.

ఇట్లు స్కాంధ పురాణాంతర్గతమై, వశిష్టులవారిచే చెప్పబడిన కార్తీకమహత్యమందలి పదహారో అధ్యాయం
పదహారో రోజు పారాయణం సమాప్తం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ALL COVID 19 ITEMS AVAILABLE

  ALL COVID 19 ITEMS AVAILABLE  

STARS