*కార్తీకపురాణం - 8 అధ్యాయం*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*హరినామస్మరణం*
☘☘☘☘☘☘☘☘☘
వశిష్టుడు చెప్పిన దంతా విన్న జనకుడు ఇలా అడుగుతున్నాడు… ”మహానుభావా! మీరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నాను. అందులో ధర్మం చాలా సూక్షంగా, పుణ్యం సులభంగా కనిపిస్తోంది. నదీస్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వంటి విషయాలను గురించి చెప్పారు. ఇలాంటి స్వల్ప ధర్మాలతో మోక్షం లభిస్తుండగా… వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినగానీ పాపాలు పోవని మీలాంటి ముని శ్రేష్టులే చెబుతున్నారు. మరి మీరు ఇది సూక్ష్మంలో మోక్షంగా చెబుతుండం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దుర్మార్గులు, వర్ణ సంకరులైనవారు రౌరవాది నరకాలకు పోకుండా తేలిగ్గా మోక్షాన్ని పొందుతున్నారు. ఇదంతా వజ్రపు కొండను గోటితో పెకిలించడం వంటిదే కాదా? దీని మర్మమేమిటి? నాకు సవివరంగా చెప్పండి” అని ప్రార్థించాడు. అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి . ‘జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే, నేను వేద వేదంగములను కూడా పఠించాను. వాటిల్లోనూ సూక్ష్మ మార్గాలున్నాయి. అవి సాత్విక, రాజస, తామసాలు అని పిలిచే మూడు రకాల ధర్మాలున్నాయి. సాత్వికమంటే… దేశ కాల పాత్రలు మూడు సమాన సమయంలో సత్వ గుణం జనించి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తాం. మనోవాక్కాయ కర్మలతో ఒనర్చే ధర్మం అధర్మంపై ఆదిక్యత పొందుతుంది. ఉదాహరణకు తామ్రవర్ణ నది సముద్రంలో కలిసిన తావులో స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగ,యమున, గోదావరి, కృష్ణ నదుల పుష్కరాలు మొదలు పుణ్యకాలాల్లో దేవాలయాల్లో వేదాలను పఠించి, సదాచారుడై, కటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఎంత స్వల్ప దానం చేసినా… లేక ఆ నదీ తీరంలో ఉన్న దేవాలయంలో జపతపాదులను చేయుట విశేష ఫలితాలనిస్తుంది. ఇక రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులతో చేసే ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతుకమై కష్టసుఖాలను కలిగిస్తుంది. తామస ధర్మమనగా… శాస్త్రోక్త విధులను విడిచి, దేశకాల పాత్రలు సమకూడని సమయంలో డాంబిక చరణార్థం చేసేది. ఆ ధర్మం ఫలాన్ని ఇవ్వదు. దేశకాల పాత్రము సమ కూడిన పుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నా నారాయుణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు’ అని ఇలా చెప్పసాగారు.
🙏_*ఆజా మీళుని కథ_*🙏
పూర్వ కాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో నాలుగు వేదాలు చదివిన బ్రాహ్మడు ఒకడుండేవాడు. అతని పేరు సత్య వ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయిన భార్య ఉంది. ఆ దంపతులు అన్యోన్యత, ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అనే పేరు తెచ్చుకున్నారు. వారికి చాలాకాలానికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వారు ఆ పిల్లాడిని గారాబంగా పెంచి, అజామిళుకుడని పేరు పెట్టారు. అతను గారాబంగా పెరగడం వల్ల పెద్దలను నిర్లక్ష్యం చేస్తూ దుష్ట సహవాసాలు చేయసాగాడు. విద్యను అభ్యసించక, బ్రాహ్మణ ధర్మాలను పాటించక సంచరిచేవాడు. అలా కొంతకాలం తర్వాత యవ్వనవంతుడై కామాంధుడయ్యాడు. మంచిచెడ్డలు మరిచి, యజ్ఞోపవీతం తెంచి, మద్యంసేవించడం, ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి, నిరంతరం ఆమెతోనే కామ క్రీడల్లో తేలియాడుచుండేవాడు. ఇంటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె ఇంట్లోనే భోజనం చేస్తూ ఉండేవాడు. అతి గారాబం వల్ల ఈ దుష్పరిణామాలు ఎదురయ్యాయి. చిన్నపిల్లల్ని చిన్నతనం నుంచి అదుపాజ్ఞల్లో పెట్టకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. అజామీళుడు కులభ్రష్టుడు అయ్యాడు.
కుల బహిష్కరణతో అతను మరింత కిరాతకుడిగా మారాడు. వేట వల్ల పక్షులను, జంతువులను చంపుతూ అదే వృత్తిలో జీవించసాగాడు. ఒక రోజున అజామీలుడు, అతని ప్రేయసి అడవిలో వేటాడుతూ తేనె పట్టు తీసేందుకు ఆమె చెట్టుపైకెక్కి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందింది. అజామీళుడు ఆమెపైపడి కాసేపు ఏడ్చి, ఆ తర్వాత అడవిలోనే దహనం చేసి, ఇంటికి తిరిగి వెళ్లాడు. అప్పటికే ఆ ఎరుకల మహిళకు ఒక కుమార్తె ఉండడంతో, అజామీళుడు ఆమెను పెంచసాగాడు. ఆమెకాస్తా యుక్తవయసుకు వచ్చేసరికి అజామీళుడు కామంతో కళ్లు మూసుకుపోయి, ఆమెను చేపట్టాడు. ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచుండేవాడు. వీరికి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆ ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు. ఆ తర్వాత ఆమె మరలా గర్భందాల్చి ఓ కుమారుడిని కన్నది. వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలవసాగారు. ఒక్క క్షణమైనా ఆ బాలుడిని విడవకుండా, ఎక్కడకు వెళ్లినా… తన వెంట తీసుకెల్తూ… నారాయణా అని ప్రేమతో సాకుచుండిరి. ఇలా కొంతకాలం గడిచాక అజామీళుడి శరీరం పటుత్వం కోల్పోయింది. రోగస్తుడయ్యాడు. మంచం పట్టి కాటికి కాలుచాచాడు. ఒకరోజు భయంకరాకారాలతో, పాశాయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామీళుడు భయపడి కుమారుడిపై ఉన్న వాత్సల్యంతో ప్రాణాలు విడువలేక… నారాయణా… నారాయణా… అని పిలుస్తూ ప్రాణాలు విడిచాడు. అజామీళుడి నోట నారాయణ శబ్దం రాగానే యమభటులు గడగడా వణికారు. అదే వేళకు దివ్య మంగళకారులు, శంకచక్ర గధాధరులూ అయిన శ్రీమహావిష్ణువు దూతలు విమానంలో అక్కడకు వచ్చి, ”ఓ యమ భటులారా! వీడు మావాడు. మేం వైకుంఠౄనికి తీసుకెళ్లడానికి వచ్చాం” అని చెప్పి, అజామీళుడిని విమానమెక్కించి తీసుకుపోయారు. యమదూతలు వారితో ”అయ్యా… వీడు పరమ దుర్మార్గుడు. వీడు నరకానికి వెళ్లడమే తగినది” అని చెప్పగా… విష్ణుదూతలు అతను చనిపోవడానికి ముందు నారాయణ పదాన్ని ఉచ్చరించాన్ని ఊటంకించి, ఆ పాపాలన్నీ ఆ నామ జపంతో తొలగిపోయాయని, అతను ఇప్పుడు పునీతుడని చెప్పుకొచ్చారు. ”’సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త్య దు:ఖా సుఖినోభవంతు” అన్నట్లు అజామీళుడు విష్ణుసాన్నిధ్యాన్ని పొందాడని వశిష్టుడు జనకమహారాజుకు వివరించారు.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి ఎనిమిదో అధ్యాయం, ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తం