*కార్తీకపురాణం - 7 అధ్యాయం*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శివకేశవార్చన విధులు*
☘☘☘☘☘☘☘☘☘
కార్తీకమాసానికి సంబంధించి వశిష్టులవారు జనకమహారాజుకు ఇంకా ఇలా చెబుతున్నారు…” ఓ రాజా! కార్తీక మాసం, దాని మహత్యం గురించి ఎంత తెలిసినా… ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించినవారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. తులసీదళాలతోగానీ, సంహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యం కలుగుతుంది. కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకింద సాలగ్రామం పెట్టి భక్తితో పూజించిన వారికి మోక్షం కలుగును. అలాగే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుకింద భోజనం పెట్టి, తను తినిన సర్వపాపాలు తొలగిపోవును.
కార్తీకమాసంలో దీపారాధనకూ ప్రత్యేక స్థానముందని ఇదివరకే చెప్పాను. అయితే అలా రోజూ దీపారాధన చేయలేనివారు ఉదయం, సాయంత్రం వేళల్లో ఏదైనా గుడికి వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేసినా… వారి పాపాలు నశించును. సంపత్తిగలవారు శివకేశవుల ఆలయాలకు వెళ్లి భక్తితో దేవతార్చన చేయించినట్లయితే… వారికి అశ్వమేథ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. అంతే కాకుండా వారి పితృదేవతలకు కూడా వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది. శివాలయానికి గానీ, విష్ణువు ఆలయానికి గానీ జంఢా ప్రతిష్టించాలి. అలా చేసినవారి దరిని కూడా యమ కింకరులు సమీపించలేరు. కోటి పాపాలైనా… సుడిగాలిలా కొట్టుకుపోతాయి.
ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి, వరిపిండితో శంఖు చక్ర ఆకారాలతో ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి, వాటిపై నిండా నువ్వుల నూనె పోసిన దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం రాత్రింబవళ్లు ఆరకుండా చూడాలి. దీనినే నంద దీపం అంటారు. ఈ విధంగా చేసి, నైవేద్యం పెడుతూ… కార్తీకపురాణం చదివినట్లయితే.. హరిహరులు ఇద్దరూ సంతసిస్తారు. అలా చేసిన వ్యక్తి కైవల్యం పొందుతాడు. అందుకే కార్తీకమాసంలో శివుడిని జిల్లేడుపూలతో అర్చిస్తారు. దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామానికి ప్రతినిత్యం గంధం పట్టించి, తులసిదళంతో పూజించాలి. ఏ మనిషీ ధనబలం కలిగి ఉంటాడో… అతను ఆ మాసంలో పూజాదులు చేయడో… అతను మరుజన్మలో కుక్కలా పుట్టి, తిండి దొరక్క ఇంటింటికీ తిరిగి, కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో మరణాన్ని పొందుతాడు. కాబట్టి కార్తీకమాసంలో నెలరోజులై పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైనా చేస్తే… అవి విశకేశవులను పూజించిన ఫలితాన్నిస్తుంది. అందుకే ఓ మహారాజ… నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు” అని చెప్పారు.”నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం
నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం”
*_ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి ఏడవ అధ్యాయము_*
*ఏడవ రోజు పారాయణము సమాప్తము.*