రేపు భీష్మ ఏకాదశి
మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీ కృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీ కృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీ కృష్ణుడిని అడిగారు. శ్రీ కృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీ కృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీ కృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.
మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండి పొయ్యాడు
ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీ కృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇత్రులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీ కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్న అని శ్రీ కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను'అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈ నాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు.అదే నీటిని మెఘ వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది. ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి, ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.
జై శ్రీమన్నారాయణ