గరుడ పురాణము - సంపూర్ణం
8 .శ్రీ కృష్ణావతారము
ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగములో అధర్మ ప్రవృత్తు లైన రాజుల వలన భూభారము పెరిగినప్పుడు భూదేవి కోరికపై శ్రీ హరి, కృష్ణావతారము నెత్తెను. దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున జన్మించి, వ్రేపల్లెలో నంద యశోదల యింట పెరిగి బాల్య క్రీడలచే వారిని అలరించి, దుష్ట రాక్షసులను సంహరించెను. మధురా పురమునకు పోయి కంసుని సంహరించి, మాతామహుని రాజ్యమున నిలిపి, బలరామునితో గలిసి శత్రువులను నిర్మూలించెను. రుక్మిణ్యాది అష్ట మహిషులను వివాహ మాడెను. నరకుని జంపి 16000 మందిని వాని చెర నుండి విడిపించి పెండ్లాడెను. ద్వారకా నగరమును నిర్మించి బార్యా పుత్ర బంధు మిత్ర పరివారముతో నూట పాతిక యేండ్లు భూలోకమున నివసించెను. భారత యుద్దములో పాండవుల పక్షమున నుండి అధర్మ పరులను నాశనము చేసెను. తరువాత యాదవులు మదించి అధర్మముగా ప్రవర్తించు చుండగా ముసలము వంకతో వారిని గూడా సంహరించి తాను పరమ పదమునకు చేరెను .
9 బుద్దావతారము
ఒకప్పుడు రాక్షసులు విజ్రుంభించి దేవలోకము పై దండెత్తి దేవతల నోడించి తరిమివేసిరి, దేవతలు ప్రార్ధింపగా మాధవుడు, మాయా మోహ స్వరూపముతో శుద్దో దనుని కుమారుడుగా జన్మించెను. వేద విరుద్దములైన బోధలతో రాక్షసుల నందరును సమ్మోహ పరచి వారిని వేద బాహ్యులను జేసెను. ఒక్క రాక్షసులనే కాక భూలోక వాసులను గూడా భ్రమింపజేసెను. రాక్షసులు పాషండులై బలమును తేజమును కోల్పోయిరి. అప్పుడు దేవతలు వారి నోడించి స్వర్గమును చేజిక్కించు కొనిరి.
10 కల్క్యవ తారము
బుద్దుని బోధనల ప్రభావము భూలోకమున రాజులపై ప్రసరించును. వారు ధర్మ పరులై ప్రజా కంటకులై ప్రవర్తింతురు. ప్రజలు కూడా అన్యాయ ప్రవర్తనులై వేద కర్మల నాచరింపక యుందురు. అప్పుడు కలియుగములో విష్ణు యశుడను వానికి శ్రీ హరి, కల్కి రూపముతో జన్మించును. ధర్మమును తిరిగి ప్రతిష్టించును. ఈ దశావతారముల కధను విన్నవారికి అనంతమైన పుణ్యము గలుగును. శ్రీ మన్నారాయణుడింకను ఎన్నో అవతారము లెత్తెను. అవి యన్నియు ధర్మ సంస్థాపనము చేయుటకే యని గ్రహింపవలెను.
ఇది గరుడ పురాణము సంపూర్ణం